3, మే 2011, మంగళవారం

వ్యాకరణం - సమాసములు


సమాసములు
సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అందురు.
అవ్యయీభావ సమాసము: సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము అవ్యయముగాను, రెండవ పదము విశేష్యముగాను ఉండును. సమాసము నందలి రెండు పదములలో మొదటి పదము క్రియతో అన్వయించును. అనగా పూర్వ పదము యొక్క అర్ధము ప్రధానముగా కలది. పూర్వ పదార్ధ ప్రధానము. అవ్యయీభావ సమాసము
ఉదా: యధాక్రమము - క్రమము ననుసరించి
ద్విగు సమాసము: సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
ఉదా: మూడు లోకములు - మూడు అయిన లోకములు.
సమాహార ద్విగుసమాసము: ద్విగు సమాసము నందలి పదము సముదాయార్ధమును చెప్పినచో అది సమాహార ద్విగు సమాసమగును.
ఉదా: పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉండును.
ఉదా: మధుర వచనము - మధురమైన వచనము
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము గాను ఉండును.
ఉదా: వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వోత్తర పదములు రెండును విశేషణములుగా నుండును.
ఉదా: సరస మధురము - సరసమును, మధురమును

ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము ఉపమానపదమై, రెండవ పదము ఉపమేయ పదమగును.
ఉదా: బింబోష్ఠము - బింబము వంటి ఓష్ఠము
ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము: సమాసము నందలి పూర్వపదము ఉపమేయపదమై, రెండవ పదము ఉపమాన పదమగును.
ఉదా: హస్త పద్మము - పద్మము వంటి హస్తము.
అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము: దీనికి రూపక సమాసమని మరియొక పేరుగలదు. సమాసమునందలి రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. ఉపమానము యొక్క ధర్మమును ఉపమేయము నందారోపించుటను రూపకమందురు.
ఉదా: విద్యా ధనము - విద్య అనెడి ధనము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము: సంభావనమనగా సంబోధనము, గుర్తు అను అర్ధములు కలవు. సమాసము నందలి పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాసమగును.
ఉదా: ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
నఞ్ తత్పురుష సమాసము: అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు '' వర్ణము వచ్చును. ఈ '' వర్ణమునకు హల్లు పరమగునపుడు న - '' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
ఉదా: అనుచితము -న + ఉచితము
ద్వంద్వ సమాసము: ఉభయ పదార్ధ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము నందలి రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.
ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
బహు పద ద్వంద్వ సమాసము: రెండు కంటెను ఎక్కువ పదములతో ఏర్పడిన సమాసమును బహు పద ద్వంద్వ సమాసమంటారు.
ఉదా: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు - రాముడు, లక్ష్మనుడు, భరతుడు, శత్రుఘ్నుడు.
బహువ్రీహి సమాసము: అన్య పదార్ధ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము నందలి పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము నందలి రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
ఉదా: చక్ర పాని - చక్రము  చేతియందు కలవాదు (చక్రము ఎవరి చేతియందు కలదో వాడు).

ప్రత్యయాలు విభక్తి పేరు
డు, ము, వు, లు--- ప్రథమా విభక్తి.
నిన్, నున్, లన్, గూర్చి, గురించి--- ద్వితీయా విభక్తి.
చేతన్, చేన్, తోడన్, తోన్--- తృతీయా విభక్తి.
కొఱకున్ (కొరకు), కై--- చతుర్ధీ విభక్తి.
వలనన్, కంటెన్, పట్టి--- పంచమీ విభక్తి.
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్--- షష్ఠీ విభక్తి.
అందున్, నన్--- సప్తమీ విభక్తి.
, ఓరీ, ఓయీ, ఓసీ--- సంబోధనా ప్రథమా విభక్తి.


వ్యాకరణం - సంధులు


వ్యాకరణము  -సంధులు
సంధి  :   పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశంగారావడము సంధి అనబడుతుంది
స్వరము =అచ్చు ;
సంధి అనగారెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును. ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' ' కారము వచ్చినది. రాముడు + అతడు = రాముడతడు అయినది.
ఆగమం = ఒక అక్షరం అధికముగా వచ్చిచేరడం ఆగమం
ఆదేశము=ఒక అక్షరాన్ని తొలగించి ఆస్థానంలో మరొక అక్షరం రావడం ఆదేశం
ఏకాదేశం = రెండు అక్షరాలను తొలగించి వాటిస్థానంలో ఒక అక్షరమ్ రావడం ఏకాదేశం
పూర్వ పదము =సంధి విడదీసినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదము అంటారు
రాముడు+ అతడు అనుదానిలో "రాముడు" అనునది పూర్వపదము
పరపదము=సంధి విడదీసినప్పుడు రెండవ పదాన్ని పరపదము అంటారు
రాముడు+ అతడు అనుదానిలో "అతడు"అనునది పరపదము
పూర్వస్వరము:పూర్వపదము లోని చివరి అచ్చు పూర్వస్వరము
"రాముడు" లోని చివరి అచ్చు పూర్వస్వరము
పరస్వరము:పరపదం లోని మొదటి అచ్చు పరస్వరం
"అతడు"లోని మొదటి అచ్చు పరస్వరం
తెలుగు సంధులు
ఉత్త్వసంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు
ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి
ఉత్తు =హ్రస్వమైన ఉకారం (ఉ)ఉత్తు
సంధి విడదీసినప్పుడు పూర్వ పదం చివర వుంటె అది అత్వ సంధి , ఉంటె అది ఇత్వ సంధి, ఉంటె అది ఉత్వసంధి
(ఈ నియమం తెలుగు సంధులకు మాత్రమె)
వికల్ప ఉత్త్వసంధి: ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణము లందున్న ఉత్త్వానికి సంధి వైకల్పికంగా వస్తుంది
ప్రథమేతర విభక్తి= ద్వితీయ మొదలుగాగల విభక్తి ప్రత్యయాలు
శత్రర్థము :వర్తమానకాలిక అసమాపక క్రియ
ద్వితీయాది విభక్తులలో ఉండే ఉత్త్వనికి .శత్రర్థ చువర్ణంలోఉన్న ఉత్త్వానికి సంధి వైకల్పికంగా వస్తుందని సూత్రార్థము
 ఉదా:"నాయందున్+ఆశ "  అందు అనునది సప్తమి విభక్తి ప్రత్యయం
ఇందలి ఉత్త్వానికి సంధి జరిగి "నాయందాశ"
సంధి జరుగక "నాయందునాశ" అగును
యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
         "మా+ఇల్లు" ఈ పదాలను కలపడానికి ప్రయత్నించండి
"మిల్లు" అని రూపము ఏర్పడిందికదా!
"రాముడు + అతడు" అనేపదాలను కలిపినప్పుడు రాముడతడు అనే పదం ఏర్పడింది  గమనించారా! ఇక్కడ అర్థం మారలేదు
 "మా+ఇల్లు" ఈ పదం అలాకాదు ,ఈ పదాలను కలిపి నప్పుడు ఏర్పడిన "మిల్లు" అనే పదానికి అర్థం మారింది గమనించారా ! అంటే సంధి జరుగలేదన్నమాట .అలాంటిచోట ఈ యడాగమ సంధి వస్తుంది.మా+ఇల్లు అని ఉండగా రెండు పదాల మధ్యలో య్ అధికముగా వచ్చిచేరి
పరస్వరాన్ని తనలో కలిపేసుకుంటుంది.అంటే యడాగమం వచ్చింది పరస్వరానికన్నమాట .ఒక్కసారి సూత్రాన్ని గమనించండి .ఇదే విషయం చెపారుకదా
మా+య్+ఇల్లు =మాయిల్లు అనే రూపము తయారైంది .ఇలా ఒక అక్షరము అధికముగా రావడాన్నె ఆగమం అంటారు.ఇక్కడ ఆగమంగా వచ్చింది య్ కావున, ఇది యడాగమ సంధి.
గుర్తుంచుకోండి  యడాగమం అంటే ఆగమంగా వచ్చేది కాదు య్ మాత్రమే.ఇకముందు చెప్పే ఆగమాలన్నీ ఇంతే రుగాగమం అంటే ర్ 
టుగాగమం అంటే ట్ ఆగమంగా వస్తాయి
అత్త్వసంధి: అత్తునకు సంధి బహుళముగానగు.
అత్తు= హ్రస్వమైన అకారము (అ)అత్తు
బహుళము =వ్యాకరణ కార్యము ఒకటికన్నా ఎక్కువ రకాలుగా జరగడం బహుళము
అవి నాలుగు విధాలు
నిత్యము : సంధి కచ్చితంగా జరగడం
నిషేధం:సంధి జరగక పోవడం
వైకల్పికం: సంధి ఒకసారి జరిగి మరొకసారి జరగక పోవడం
అన్యవిధం: వ్యాకరణ కార్యము మరొకవిధంగా జరగడం
(వీటికి ఉదాహరణలు తగినచొట చెపుతాను)
ఉదా: రామ+అయ్య =రామయ్య (నిత్యము)
       ధూత +ఇతడు =దూతయితడు (నిషేధము)
       మేన+అల్లుడు=    {సంధి జరిగి} మేనల్లుడు
                         {సంధి జరుగక}  మేనయల్లుడు (వైకల్పికము
      తామర+ఆకు =తామరపాకు (అన్యవిధము)
ఇత్త్వసంధి: ఇత్త్వ సంధి మూడురకాలుగా జరుగుతుంది
౧)ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది
ఏమ్యాదులు= మరి,ఏమి,అది.అవి,ఇది,ఇవి,ఏది.ఏవి-కి షష్ఠి.
.ఒకసారి సూత్రాన్ని చూడండి వైకల్పికంఅని ఉందికదా,అంటే సంధి జరుగవచ్చు జరుగక పోవచ్చు
ఏమి+అది =ఏమది(సంధి జరిగి) 
సంధి జరుగకపోతే ఏమౌతుందో తెలుసుకదా ! యడాగమంవస్తుంది
ఏమి+య్+అది= ఎమియది (సంధి జరుగక)
కి షష్ఠి అంటే "కిన్ కున్ యొక్క లోన్ లోపలన్"షష్ఠి విభక్తి ప్రత్యయాలుకదా.వాటిలోని కిన్ అనేదే కి .అర్థం కాలేదా! రామునికిదీనిలోని కి షష్టి విభక్తి ప్రత్యయమే .
రామునికిన్+ఇచ్చి=రామునికిచ్చి (సంధి జరిగి)
                        రామునికినిచ్చి(సంధి జరుగక) ఇక్కడ సంధి జరుగకపోతే యడాగమం రాదు రామునికిన్ లోని న్ పరస్వరంతో కలిసి పోతుంది

౨)క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది
క్రియ అంటే తెలుసు కదా? పని.క్రియా పదాలంటే క్రియను తెలిపే పదాలు
ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు(సంధి జరిగి)
                            వచ్చితిమియిప్పుడు(సంధి జరుగక యడాగమం వచ్చి)
౩) క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు.
 క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ .ఒకే వ్యక్తి రెండు పనులు చేసినప్పుడు మొదటిపని క్త్వార్థము.చూడండి
 తెచ్చి+ఇచ్చెను
తెచ్చింది , ఇచ్చింది ఒకరే తెచ్చి అనెది మొదటిపని, అంటే అది క్త్వార్థము.దానిలో ఉన్న ఇ క్త్వార్థమైన ఇత్తు.దానికి సంధిలేదని సూత్రము.సంధిలేదు అంటే నిషేధమన్నమాట.కాబట్టి యడాగమం వస్తుంది.
తెచ్చి+య్+ఇచ్చెను=తెచ్చియిచ్చెను


ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఆమ్రేడితము:ఒకేమాట రెండుసార్లుపలికితే రెండవసారి పలికిన రూపాన్ని ఆమ్రేడితం అంటారు
ఉదా:అప్పుడు+అప్పుడు అన్నప్పుడు రెండవసారి పలికిన "అప్పుడు" ఆమ్రేడితం
తరచుగా=బహుళము
ఆమ్రేడిత సంధి బహుళమని సూత్రార్థము
ఔర+ఔర=ఔరౌర (నిత్యము)
ఏమి+ఏమి=ఏమేమి -ఏమియేమి (ఇది ఏమ్యాదుల ఇత్తు కావున సంధి  వైకల్పికము)
ఏగి+ఏగి=ఏగియేగి (క్త్వార్థమైన ఇత్తుకావున సంధి జరుగక యడాగమం వస్తుంది)
హల్  సంధులు
ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
 ఉదా: నడు+ఇల్లు
పూర్వ పదంలో ఉన్న డు ను తొలగించి ఆస్థానములో ట్టు ఆదేశముగావచ్చును
నట్టు+ఇల్లు (ఇక్కడ ఉత్వ సంధి వచ్చి) "నట్టిల్లు" అగును
చిఱు+ఎలుక
పూర్వ పదంలో ఉన్న ఱు ను తొలగించి ఆ స్థానములో ట్టుఆదేశముగా వచ్చును
చిట్టు+ఎలుక  (ఇక్కడ ఉత్వ సంధి వచ్చి) "చిట్తెలుక" అగును
గమనించారా ! ఱ డ లను తొలగించి ఆస్థానములో ట్టు వస్తుంది కావున ఇది ఆదేశ సంధి
గసడదవాదేశ సంధి: గసడదవాదేశసంధి మూడురకాలుగా రకాలుగా జరుగుతుంది
౧)ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.
పరుషములు: క చ ట త ప అను ఐదు వర్ణములు పరుషముల స్థానమున గ స డ ద వ అనే ఐదు వర్ణములు ఆదేశంగావస్తాయి
క - గ
చ - స
ట - డ
త - ద
ప - వ
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె - వాడుకొట్టె (వైకల్పికం)
          లెస్స+కాను =లెస్సగాను(నిత్యము)
౨)తెనుగులమీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు
 వి!! తెనుగులమీది= అచ్చ తెలుగు పదాలకు
      మీది = పరమైన
      సాంస్కృతిక =సంస్కృత పదాల లోని పరుషములకు గసడదవలు రావని సూత్రార్థము
ఉదా!! వాడు+ టక్కరి
     వాడు అనునది అచ్చ తెలుగు పదము
  దానికి టక్కరి అను సంస్కృతపదంలోని ట అను పరుషము పరమైనది .ఆపరుషము గ గామారదు
కావున
వాడుటక్కరి అనే వుండును
౩)ద్వందంబున పదంబుపై పరుషంబునకు గసడదవలగు
వి!! ద్వంద్వంబున =ద్వంద్వ సమాసంలో (దీనిగురించి సమాసముల గురించి తెలుసుకునేప్పుడు వివరిస్తాను)
పదంబుపై = పూర్వ పదానికి పరమైన పరుషం స్థానంలో గసడదవలు  వస్తాయి
తల్లి+తండ్రి =పరపదంలోని త స్థానంలో గసడదవలలోని ద వచ్చి
 తల్లిదండ్రులు అవుతుంది
సరళాదేశ సంధి: ఈ సంధి గురించి తెలుసుకునేముందు ద్రుతము గురించి తెలుసుకుందాం
 నకారానికి ద్రుతమనిపేరు
ద్రుతమనగా ద్రుతినొందునదని అర్థము. అనగా అవసరము లేనప్పుడు లోపించునదని
ఉదాహరణకు "చూచెను" అను పదాని చూడండి అందలి ను ద్రుతము దది లోపిస్తే "చూచె" అని మిగులుతుంది .గమనించండి ద్రుతం లోపించిన లోపించకపోయిన అర్థంలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదుకదూ ! ఇలాంటి ను నుద్రుతమని పిలుస్తారు,
పైనచూపిన "చూచెను" అనుపదంలో చివర ద్రుతము ఉందికదా! ఇలాద్రుతము చివరగా గల పదాలను ద్రుతప్రకృతికాలంటారు.
అంటే వినెను,తినెను,పాడెను లాంటివి ద్రుతప్రకృతికాలు.
ఇప్పుడు సరళాదేశసంధి గురించి తెలుసుకుందాం
సరళాదేశసంధి రెండు సూత్రాలలో పూర్తవుతుంది
ఉదా!! పూచెను+కలువలు అను ఉండగా
౧)"ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు" అనుసూత్రము వల్ల
పూచను+గలువలు అగును
గమనించండి కలువలు లోని క - గ గామారింది.అంటే పరుషాన్ని తొలగించి సరళం ఆదేశంగా వచ్చింది .కావున ఈ సరళాన్ని ఆదేశసరళం అంటారు
౨) ఆదేశసరాళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి
బిందువు= సున్నా (నిండు సున్నా,అరసున్నా లు రెంటిని బిందువు అంటారు)
సంశ్లేష = రెండూహల్లులు కలువడం సంశ్లేష ,అంటే సంయుక్తాక్షరము అన్నమాట
ద్రుతము మీదిహల్లు తోకలవడం ఇక్కడ సంశ్లేష.
వి!! ఆదేశ సరళానికి ముందున్న ద్రుతము బిందువుగానో సంశ్లేషగానో మారుతుందని అర్థము
పూచెంగలువలు -బిందువు( నిండు సున్నా వచ్చి)
పూచెఁగలువలు -బిందువు (అరసున్నా వచ్చి)
పూచెన్గలువలు-సంశ్లేష (న్గ - సంశ్లేష)
ఒకసారి ౨వ సూత్రాన్ని చుడండి విభాష అనేమాట కనిపిస్తుందా అంటే అర్థం తెలుసా వైకల్పికం. అంటే,ఒకసారి రావడం మరొకసారి రాకపొవడం ఇప్పుడు ఈ ౨ వ సూత్రాన్ని గమనించండి అర్థమైందా బిందుసంశ్లేషలు ఒక సారి రాకపోవచ్చు రాకపోతె 
పూచెను గలువలు అని వుంటుంది
పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణానికి  పు-౦పు లు వస్తాయి
కర్మధారయము =విశేషణానికి విశేష్యము తో సంబంధము కర్మధారయము
ఉదా: సరసము+మాట అని ఉండగా
సరసము అనేది విశేషణము
మాట అనునది విశేష్యము
ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ,సరసము లోని ము స్థానములో పు గాని ,౦పూ గాని ఆదేశంగా వస్తాయి
సరసపుమాట =పు ఆదేశంగా వచ్చి
సరసంపుమాట = ౦పు ఆదేశంగా వచ్చి
టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
ఉత్త్వ సంధి జ్ఞాపకముందా ,ఆఉత్త్వ సంధి కర్మధారయ సమాసమైతే ట్ ఆదేశంగావస్తుంది
ఉదా: పేరు+ఉరము
   పై ఉదాహరణ గమనించండి ఉత్త్వసంధి ప్రకారము "పేరురము" కావలసి వుండగా ,టుగాగమం వచ్చి
పేరు+ట్+ఉరము=పేరుటురము అవుతుంది (ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము)
రుగాగమ సంధి: రుగాగమసంధికి రెండు సూత్రాలుంటాయి
౧)పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు
పేదాదులు=పేద మొదలైన శబ్దాలు =పేద(పేదరాలు),బీద(బీదరాలు),ముద్ద(ముద్దరాలు) ,బాలెంత(బాలెంతరాలు) మొదలైనవి పేదాదులు
ఆలు= స్త్రీ
ఉదా: పేద+ఆలు =పేద+ర్+ఆలు=పేదరాలు  (పైన చూపిన శబ్దాలన్ని తెలుగు శభ్దాలే)
౨) కర్మధారయంబులందు తత్సమశభ్దాలకు ఆలు శబ్దం పరమైతే అత్త్వానికి ఉత్త్వము రుగాగమము వస్తాయి
తత్సమ శబ్దాలు=సంస్కృతంతోసమానమైన శబ్దాలు
ధీర+ఆలు అని ఉండగా ,
ధీ అనునది తత్సమ శబ్దము.అకారాంత శభ్దము ,దానికి ఆలు  పరమైంది ఇప్పుడు మొదత ఉత్త్వం వచ్చి "ధీర" "ధీరు" అవుతుంది
ధీరు+ఆలు ఇప్పుడు రుగాగమం వస్తుంది (ర్)
ధీరు+ర్+ఆలు=ధీరురాలు                              
దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
                        యుస్మదర్థము=నీవు, మీరు అను అర్థమును బోధించు సర్వనామములు (నీ ,మీ)
                        అస్మదర్థము =నేను అర్థమును బోధించు సర్వనామములు(నా,మా)
                        ఆత్మార్థము =తాను అను అర్థమును బోధించు సర్వనామములు(తన,తమ)
                        ఉత్తరపదము = సమాసంలోని రెండవపదం
 నీ,మీ - నా ,మా- తన్ - తమ అను శబ్దములకు ఉత్తరపదము పరమైతే దుఆగమంగావస్తుంది
ఉదా: నీ+చెలిమి= అని ఉండగా నీ అనునది యుస్మదర్థము ,దానికి "చెలిమి"అను ఉత్తరపదం పరమైంది కావున దు ఆగమంగా వచ్చి
                        నీ+దు చెలిమి =నీదుచెలిమి అని ఏర్పడుతుంది
నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ౦పులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
                ఉదంతము= ఉ అనే అచ్చుతో ముగిసేపదం (తళుకు  అనే పదం ఉదంతం)
                పు-౦పు లు = పుంప్వాదేశ సంధిలో ఆదేశంగావచ్చేవి
ను(ద్రుతము) ఆగమంగావచ్చి పరుషం పరమైతే సరళాదేశ సంధి జరుగుతుంది ,సరళం పరమైతే  ద్రుతానికి లోపంగాని సంశ్లేషగాని వస్తుంది             
చిగురు=ఉదంత స్త్రీ సమము
సింగపు(సింగము) పుంప్వాదేశము ;వీటికి పరుషముకాని సరళముగాని పరమైతే నుగాగమం(ద్రుతము) వస్తుంది .
పరుషాలు పరమై నుగాగమం వస్తే సరళాదేశసంధి (సరళాదేశ సంధి చూడండి)
సరళాలు పరమైతే ఏమి జరుగుతుందోచూడండి
తళుకు+గజ్జెలు (తళుకు అనేది ఉదంతము,దానికి గొ అనే సరళము పరమైంది కావున నుగాగమం వస్తుంది)
తళుకు+ను+గజ్జెలు =ఇలాఆగమంగావచ్చిన ను సరళం పరమైంది కావున లోపించడమో ,సంశ్లేషగానో మారుతుంది
తళుకు గజ్జెలు (ను లోపించి)
సంశ్లేషకు సరళాదేశసంధి చూడండి                                       
పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.
పడ్వాదులు =పడు మొదలైనవి=పడు,పెట్టు, పట్టె మొదలైనవి
క్రింది ఉదాహరణ చూడండి
ఉదా: భయము+పడె   పడె అనునది పరమైంది కదా ఇప్పుడు భయములోని ము లోపించి "భయపడె" అవుతుంద;పూర్ణబిందువు వచ్చి "భయంపడె" అవుతుంది
త్రిక సంధి: ౧)ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
౨)త్రికము మీది అస0యుక్త హల్లునకు ద్విరుక్త0బగు.
౩)ద్విరుక్త0బగు హల్లు పర0బగునప్పుడు ఆచ్ఛిక0బబబైన దీర్గ0నకు హ్రస్వ0బగు అను మూడు సూత్రాల్లో త్రిక సంధి రూపాలు ఏర్పడుతాయి చూడండి
ఉదా: అక్కడ అను త్రికసంధి రూపము ఎలా ఎర్పడుతుందో చూద్దాం
ఆ + కడ :పూర్వ పదంలో అనే త్రికం ఉంది (ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు)
ఆ అనే త్రికానికి కడలోని ' అనే అసంయుక్తమైన హల్లు పరమైంది ,ఇప్పుడా క ద్విరుక్తమై క్క గామారుతుంది
ఆ+క్కడ  (త్రికము మీది అస0యుక్త హల్లునకు ద్విరుక్త0బగు)
ద్విరుక్తమైన హల్లు పరమైంది కావున అనే దీర్ఘము హ్రస్వంగామరి
అక్కడ అనురూపం వస్తుంది
అలాగే ఇక్కడ ,ఏక్కడ అను రూపాలు కూడా ఏర్పడుతాయి
మరి త్రికానికి అచ్చుపరమైతే ఏమి జరుగుతుంది .చూద్దాం
ఆ+ఎడ ; ఒక్కసారి యడాగమసంధి గుర్తుకు తెచ్చుకోండి .
అవును ఇక్కడ యడాగమం వస్తుంది
ఆ+ య్+ఎడ=ఆ+ యడ  ఇప్పుడు అచ్చు హల్లుగా మారింది కదా ఇప్పుడు ఇక త్రికసంధి జరుగుతుంది
ఈ +ఇల్లు :ఏ +అడవి వీటిని కూడా సాధించి చూడండి
ప్రాతాది సంధి: దీనికికూడా సరళాదేశ సంధితో సంబంధం ఉంది
౧)సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
 సమాసంబుల అను మాటను గమనించండి అంటే రుగాగమం లా ఇదికూడా కర్మధారయ సమాసల్లొనే జరుగు తుందన్నమాట
ప్రాతాదులు =ప్రాత మొదలైన శబ్దాలు (ప్రాత,క్రొత్త , మీద,క్రింద)ప్రాతాదులు
ఉదా !! ప్రాత +కెంపు పై సూత్రం ప్రకారం ప్రాతాదుల తొలొ అక్షరం మిగిలి ,తక్కినవి లోపించాలి
    ప్రా+కెంపు -ఇప్పుడు ప్రాను ఏమంటారో తెలుసా ? లుప్త శేషము  అంటే లోపించగా మిగిలినదన్నమాట
లుప్త శెషానికి పరమైన అక్షరాన్ని గమనించండి అది పరుషమా ,సరళమా ? పరుషం కదా .ఇప్పుడు ఈసూత్రం గమనించండి
౨) లుప్త శేషమునకు పరుషం పరమైతే నుగాగమం వస్తుంది
  అర్థమైందా "ప్రా+ను+కెంపు" ఇప్పుడు ఈ ను ద్రుతము అంటారు .ఇకనుంచి సరళాదేశ సంధి వస్తుంది (ప్రాను+క్రెంపు ->ప్రాను+గెంపు ->ప్రాఁగెంపు )
ఒక్క విషయమ్ ఇక్కడ "ప్రాంగెంపు " అను నిండు సున్నా తో కూడినరూపం ఏర్పడదు ఏందుకంటే ఫ్రా అనేది దీర్ఘాక్షరం కదా ! దీర్ఘాక్షరాలమీద సాధ్య పూర్ణము ఉండదు
 ఇవి కూడా చూడండి " ప్రాత +ఇల్లు ; లేత+దూడ ; పూవు+ రెమ్మ " ఇవి ౧వ సూత్రం ప్రకారమం ఫ్రా + ఇల్లు ; లే+దూడ; పూ +రెమ్మ అను రూపాలు వస్తాయి.చూడండి  వీటికి పరుషం పరుషం పరం కాలేదు కదా !నుగాగమం రాదు కాబట్టి  "ఫ్రాఇల్లు ; లేదూడ; పూరెమ్మ " అని ఉంటాయి
ఆన్నట్టు " మీగడ ,పందొమ్మిది మొదలైనవి కూడా ప్రాతాది సంధులే
 ఇంకొక్క విషయం లుప్తశేషానికి పరుషం కాని మరో అక్షరం కాని పరమైతే  ఒకోసారి నుగాగమం ,మరోసారి మీది హల్లుకు ద్విత్వము వస్తాయి
నుగాగమ రావడం పైన చూసాముకదా .ఇప్పుడు ద్విత్వాన్ని చూద్దాం
క్రొత్త +కారు ->క్రొ+కారు ->క్రొక్కారు ;
ఇలాగే "నెమ్మది, నివ్వెర




సంస్కృత సంధులు
సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా:దేవ+ఆలయం=దేవాలయం;కవి+ఇంద్ర+కవీంద్ర;  భాను+ఉదయము=భానూదయము. పితృ+ఋణం=పితౄణము:భాను+ ఉదయం లోని  మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది
గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋ లు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.
ఉదా: ఉప+ఇంద్ర=ఉపేంద్ర ; చంద్ర+ఉదయము=చంద్రోదయము.మహా+ఋషి=మహర్షి: ఏ ఓ ఆర్ లకు గుణములని పేరు.
యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - ర లు ఆదేశమగును
ఉదా: అతి+అంతము=అత్యంతము.
      అణు+అస్త్రము = అణ్వస్త్రము;  య వ ర ల కు యణ్ణులని పేరు
వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔ లు పరమగునపుడు ఔ కారమును వచ్చును
ఉదా: ఏక+ఏక=ఏకైక; మహా +ఐశ్వర్యము =మహైశ్వర్యము ;పాప+ ఓఘము=పాపౌఘము;మహా+ఔషదము మహౌషదము ;
, లకు వృద్ధులని పేరు
అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.
ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.
జస్త్వ సంధి: వర్గ ప్రధమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.
ఉదా: వాక్+ఈశ=వాగీశ. (అచ్చు పరమగుటకు)
       సత్+గతి= సద్గతి  (వర్గ తృతీయాక్షరము పరమగుటకు)
       సత్+భావము =సద్భావము (వర్గ చతుర్థాక్షరము పరమగుటకు)
శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.
ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.
ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.
ఉదా: తత్+టీక=తట్టీక.
ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు '' వర్ణము పరమైనపుడు '' కారము వికల్పముగా వచ్చును.
ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.